Thursday, November 27, 2014

తెలుగు సంగీతఝరి సుశీలమ్మ

మావి చిగురు తిని కోకిల పలుకుతుంది. కోకిల గొంతు విని మావి చిగురు చిగురిస్తుంది. ఈ రెండింటికీ మధ్య మరో లయవిన్యాసం ఉంది. అదే గానకోకిల సుశీల మధురస్వరం. పసిపాప నవ్వులోని స్వచ్ఛదనం. పాలనురుగులోని తియ్యదనం. కోయిల గొంతులోని కమ్మదనం. స్వాతిచినుకులోని తన్మయత్వం కలబోస్తే సుశీల గానం. తెలుగు సంగీతఝరిలో  పి.సుశీల ఒక ఆణిముత్యం. పాటల జలధిలో అలుపెరుగని అమృతగానం.
తెలుగు పాటల కొమ్మలో విరబూసిన కుసుమం...
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉందంటారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదుగాని తెలుగు పాటల కొమ్మలో విరబూసిన కుసుమం సుశీల గాత్రాన్ని వింటే ఇది నిజమేననిపిస్తుంది.  కోకిలమ్మకు కూడా కుహు..కుహు అని రాగాలు తీయాలనిపిస్తుందేమో.
మృదువైన స్వరానికి సుశీల చిరునామా....
శ్రావ్యమైన సంగీతానికి, మృదువైన స్వరానికి సుశీల చిరునామా అంటే అతిశయోక్తి కాబోదు. ఒకటి కాదు రెండు కాదు...వేవేల పాటలు పాడి, రెండు తరాల తెలుగు ప్రేక్షకులను తన గానామృతంలో ముంచితేల్చింది. సంగీత ప్రియుల చెవిలో అమృతపు చుక్క అయ్యింది ఈ గాన కోకిల. పసిపాప జోల పాట సుశీల. ఆలుమగల అనురాగాల తోట సుశీల. యువకుల మదిలిలో చక్కిలిగింత సుశీల. అమ్మదనపు కమ్మదనం సుశీల. యుగళగీతాల మాలిక సుశీల.
సోలో పాటల్లో తనదైన ముద్ర...
అటు పాతతరం కథానాయికలకు, ఇటు కొత్త తరం కథానాయికలకు తన గాత్రంలోని గానమాధురిని అందించారు సుశీల. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి కొమ్ములు తిరిగిన నేపథ్యగాయకులతో పాడి తెలుగుపాటకు పరిపూర్ణతను తీసుకొచ్చారు. యుగళ గీతాలనే కాదు సోలో పాటల్లోనూ తనదైన ముద్రవేసి తెలుగు పాటను శిఖరాగ్రానికి చేర్చారు సుశీల.
స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఆమె సొంతం...
స్పష్టమైన భావ ప్రకటన. అంతకంటే స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ సుశీల సొంతం. అందుకే ఆమె గాత్రంలో ప్రేక్షకులకు ఆలుమగల అనురాగం కనిపిస్తుంది. ప్రియుడికి తన ప్రియురాలి పాటలా వినిపిస్తుంది. కురిసే ప్రతీ చినుకు ఆకుపై రాలి దోబూచులాడలనుకుంటుంది. మెరిసే ప్రతి మేఘం వర్షించి వానలా కురవాలనుకుంటుంది. అలాగే తెలుగునాట పుట్టిన ప్రతీపాట సుశీల గాత్రంలో ఒదిగిపోవాలనుకుంటుంది. తెలియని తన్మయత్వంతో తన పుట్టుకకు పరిపూర్ణతను తెచ్చుకోవాలనుకుంటుంది.
సుశీల లేని తెలుగుపాటను ఊహించుకోగలమా.
సప్తస్వరాలు ఆమెను ఆవహించాయా అన్నట్టుగా ఉంటుంది సుశీల గానం. పాటే ప్రాణంగా పాడే ప్రతీ పాటకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. అందుకే ఈ గానసరస్వతి గాత్రానికి దాసోహం కాని ప్రేక్షకులు లేరు. ఓ రకంగా చెప్పాలంటే సుశీల లేని తెలుగు పాటను ఊహించుకోలేరు సంగీత ప్రియులు.
సుశీల 15వ ఏట నుంచే....
సంగీత నేపథ్యమున్న కుటుంబంలో జన్మించిన సుశీల 15వ ఏట నుంచే తన స్వరప్రస్థానాన్ని ప్రారంభించారు. జన్మతహా వచ్చిన ఆమె గాత్రానికి సినిమా రంగం నగిషీలు చెక్కింది. నాటి సంగీత శిఖరం పెండ్యాల నాగేశ్వరరావు దర్వకత్వంలో మొదలైన సుశీల సినీ గానప్రస్థానం 60 ఏళ్లపాటు అప్రతిహతంగా సాగింది. సుశీల సినీరంగ ప్రవేశం చేసేనాటికి స్వర దిగ్గజాలు పి.లీలా, జిక్కి, భానుమతి వంటి నేపథ్య గాయనీమణులు తెలుగు ప్రేక్షకులను తమ గానామృతంలో ఓలలాడిస్తున్నారు. అలాంటి తరుణంలో ప్లేబ్యాక్ సింగర్‌గా తెలుగు తెరకు పరిచయమైన సుశీల తన గాత్రంలోని విలక్షణతను ప్రేక్షకులకు రుచిచూపించారు. సోలో, భక్తి పాటలనే కాదు డ్యూయెట్లను కూడా తన స్వరంలో గింగిరులు కొట్టించారు.
అతి తక్కువ కాలంలోనే....
నేపథ్యగాయనిగా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే సుశీల పాపులర్ అయ్యారు. అలాపలను అలవోకగా పాడి హుషారెత్తించారు.  తెలుగు పదాలను హాయిగా పాడుతూ తెలుగు ప్రేక్షకులను జోకొట్టారు సుశీల. ఒక పాటకు మించి మరో పాట. దేనికదే ప్రత్యేకత. సుశీల పాడిన పాటల్లో ఏది ది బెస్ట్ అని అడిగితే సినీ సంగీత వినీలాకాశంలో తళుక్కుమనే తారలను లెక్కించడమే అవుతుంది.  పాటల సాగరగర్భంలో ఆణిముత్యాలను ఏరడమే అవుతుంది.సంగీతం తప్ప మరే ఇతర భాష రాని సుశీల తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోను అనర్గళంగా పాడి సంగీతానికి భాషాబేధాలు ఉండవని మరోసారి నిరూపించారు.
ఆధునిక పోకడలకు అనుగుణంగా.....
మహామహులైన సంగీత దర్శకుల దగ్గర పాడిన సుశీల కొత్తతరం దర్శకుల దగ్గర అంతే వినమ్రంగా పాడి సంగీతంలో చిన్నాపెద్దా తేడా ఉండదని చాటిచెప్పారు. సుశీల క్లాసికల్‌ పాటలే పాడుతారన్న ప్రచారానికి అప్పుడప్పుడే తెరకు పరిచయమౌతున్న సంగీత దర్శకులు చక్రవర్తి బ్రేకులేశారు. గుగ్గుగుగ్గు గుడిసుంది, గుడివాడకెళ్లాను లాంటి పాటలను సుశీలతో పాడించి ఆమెను మాస్‌కు మరింత చేరువ చేశారు.
దక్షిణాదిన తిరుగులేని ఆధిపత్యం....
గోదారి గట్టుపై ఆమె పాట వినిపిస్తుంది.. మొక్కజొన్న తోటలో సుశీల గానం గింగిరులు కొడుతుంది.. ఆమె స్వరానికి ప్రేపల్లియ ఎద ఝల్లున పొంగుతుంది. అదీ సుశీలమ్మ మహత్యం. అదీ ఆమె గానంలో దాగున్న అమృతం. 1957 తరువాత కొత్త నేపథ్యగాయనీమణులు తెలుగు ప్రేక్షకులకు కొత్త స్వరాలను వినిపించినా సుశీలమ్మ గాత్రాన్ని మాత్రం జనం మర్చిపోలేదు. జయసుధ, రాధ, రాధిక, విజయశాంతి వంటి నవతరం నాయికలకు  కూడా తన గాత్రాన్ని అందించి హుషారెత్తించారు. దక్షిణాదిన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
50వేల గీతాలతో సుస్థిర స్థానం...
రెండు తరాల గాయకులతో కలిసి పాడినా సుశీల గాత్రంలో ఆ మాధుర్యం తగ్గలేదు. దాదాపు 50 వేల గీతాలు ఆలపించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సుశీల. లెక్కకు మిక్కిలి పాటలు పాడిన సుశీలకు అవార్డులకు, రివార్డులకు కొదవలేదు. 2008లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌తో సత్కరించింది. జెమినీ, వాహిని, గోల్డెన్‌, వాసు, విక్రమ్, శారద, ప్రకాశ్‌, అన్నపూర్ణ సంస్థల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు సుశీల.
గానకోకిల సుశీల 80వ జన్మదినం...
వసంత రుతువులో ఎన్ని కోకిలలు వచ్చినా  సినీ వినీలాకాశంలో ఎన్ని కొత్తగాత్రాలు పుట్టినా సుశీల గాత్రానికి తిరుగులేదు. ఆమె పాటలకు కాలదోషం పట్టదు. తెలుగు పాటల పూపందిరిలో ఆమె స్వరం నిత్యనూతనంగా ఆలపిస్తూనే ఉంటుంది. 80 వసంతాల సుశీల స్వరానికి టెన్‌టీవీ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.
- 10టీవీ సౌజన్యంతో

0 comments:

Post a Comment